హార్దిక్‌కు ముంబై షాక్ ఇవ్వ‌నుందా?.. కెప్టెన్సీ అటుంచితే ఏకంగా జట్టులో చోటుకే ఎస‌రు!

  • ముంబై కెప్టెన్సీ నుంచి హార్దిక్ పాండ్యాను తొలగించే అవకాశం
  • ఈ సీజన్‌లో జట్టు దారుణ వైఫల్యమే ఇందుకు ప్రధాన కారణం
  • ఆటగాడిగా కూడా జట్టులో కొనసాగించడంపై నెలకొన్న అనుమానాలు
  • సీనియర్ ఆటగాళ్ల ప్రవర్తనపై కూడా యాజమాన్యం అసంతృప్తి
  • ఈ మేరకు 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' కథనం
ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత సంచలన పరిణామాలలో ఒకటిగా, ముంబై ఇండియన్స్ (ఎంఐ) కెప్టెన్సీ నుంచి హార్దిక్ పాండ్యాను తొలగించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో జట్టు ప్రదర్శనపై తీవ్రంగా చర్చించిన యాజమాన్యం ఈ కఠిన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' పత్రిక తన కథనంలో వెల్లడించింది.

2024 సీజన్‌కు ముందు అత్యంత విజయవంతమైన కెప్టెన్ రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు ముంబై యాజమాన్యం కెప్టెన్సీ పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే. అయితే, పాండ్యా నాయకత్వంలో 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైంది. ఆడిన 14 మ్యాచ్‌లలో కేవలం 4 గెలిచి, 10 ఓటములతో పాయింట్ల పట్టికలో 9వ స్థానానికి పరిమితమైంది. గుజరాత్ టైటాన్స్‌కు 2022లో టైటిల్ అందించిన కెప్టెన్‌గా తిరిగొచ్చిన పాండ్యా, ముంబై జట్టును మాత్రం విజయపథంలో నడిపించలేకపోయాడు.

హార్దిక్‌కు కెప్టెన్సీ అటుంచితే.. ఏకంగా జట్టులో చోటుకే ఎస‌రు?
తాజా నివేదిక ప్రకారం పాండ్యాను కేవలం కెప్టెన్సీ నుంచి తొలగించడమే కాకుండా, ఆటగాడిగా జట్టులో కొనసాగించే విషయంపై కూడా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. "సీజన్ జరుగుతున్నప్పుడే అతడిని కెప్టెన్‌గా కొనసాగించేందుకు యాజమాన్యం సుముఖంగా లేదనే సంకేతాలు స్పష్టంగా కనిపించాయి. జట్టులో దీనిపై తీవ్రమైన చర్చ జరుగుతోంది" అని ముంబై ఇండియన్స్ వర్గాలు చెప్పినట్లు కథనం పేర్కొంది.

జట్టు వైఫల్యానికి పాండ్యా కెప్టెన్సీ ఒక్కటే కారణం కాదని, సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శన, వైఖరి కూడా యాజమాన్యానికి ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మ గాయాలతో ఇబ్బంది పడటం, జస్ప్రీత్ బుమ్రా చాలా మ్యాచ్‌లలో వికెట్లు తీయలేకపోవడం, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ నిలకడలేమి వంటివి జట్టును దెబ్బతీశాయి. కోచింగ్ సిబ్బంది డేటా ఆధారంగా కొన్ని వ్యూహాలను సూచించినా, కొందరు ఆటగాళ్లు వాటిని పట్టించుకోలేదని కూడా ఆరోపణలు వస్తున్నాయి.

ప్రస్తుతానికి దీనిపై ముంబై ఇండియన్స్ యాజమాన్యం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే రాబోయే రోజుల్లో జట్టు ప్రక్షాళనపై తీవ్రమైన సమీక్షలు, చర్చలు జరగనున్నాయని, ఇందులో భాగంగా పాండ్యా భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకుంటారని స్పష్టమవుతోంది.

Hardik Pandya
Mumbai Indians
MI
IPL 2026
Rohit Sharma
Jasprit Bumrah
Suryakumar Yadav
IPL
Indian Premier League
Cricket

More Telugu News